అరసవెల్లి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సూర్య దేవాలయాల్లో అరసవెల్లి క్షేత్రం ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. శ్రీకాకుళం పట్టణ బస్టాండ్ నుండి ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ఆటోల ద్వారా చేరుకోవచ్చు. సమీప రైల్వేస్టేషన్ ఆముదాల వలసలో ఉంది. అక్కడినుంచి రమారమి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
అరసవెల్లిని పూర్వం హర్షవల్లి అని పిలిచేవారు. హర్షం అంటే ఆనందం లేదా సంతోషం, వల్లీ అంటే తీగ లేదా లత అని అర్థం. సంతోషం లతలా అల్లుకునే క్షేత్రం కాబట్టి ఇది హర్షవల్లి. కాలక్రమంలో అదే అరసవల్లి అయింది.
క్రీస్తు శకం 700వ సంవత్సరం లో నిర్మించిన దేవాలయం ఇది. ఇది కళింగదేశపు రాజు మహేంద్ర వర్మ నిర్మించాడు. అందుకే మహేంద్ర ప్రతిష్టగా కొనియాడబడే ఈ ఆలయం ఇంద్రుడు నిర్మించాడని అంటారు.
పూర్వం రాజుల పేర్లు, ఆలయంలోని మూలదైవాలపేర్లు ఒకేలా ఉండేలా చూసేవారు . ఆ దైవానికి సంబంధించిన వేలుపు ప్రధాన వేల్పుగా పెద్ద ఆలయంలోనూ...... మిగిలిన దేవుళ్ళ పేర్లు ఉపాలయాల్లోనూ ఉండేటట్టు ఆ గుడి ఆవరణలో కట్టేవారు. అలా చేస్తే తమరాజుపై ప్రజలకు భక్తి, విశ్వాసం ఉంటాయ్. అంతే కాకుండా రాజు పేరుకు దగ్గరలో ఉండే ప్రధాన దేవత ముఖ్యపూజలందుకుని, మిగిలిన దేవతలు ఉపాలయాల్లో ఉంటే, పరోక్షంగా ప్రజలకు తమరాజు గొప్పతనం మీద అన్యాపదేశంగా గౌరవం ఏర్పడుతుందనే భావన ఆ రోజుల్లో ఉండేది. అలాకాకుండా రాజు పేరు ప్రధాన దేవతకి భిన్నంగా ఉంటే, ఏ దేవుని పేరు రాజుకుందో ఆ పేరున దేవతా ప్రతిష్ట జరిగిందని స్థలపురాణం ఉండేది. ఆ క్రమంలో ఇది ఇంద్రప్రతిష్ట అని చెప్పడానికి అవకాశం ఉండచ్చు.
మహేంద్ర వర్మ రాజ్యానికి ఆ రోజుల్లో శ్రీముఖలింగం రాజధాని గా ఉండేది. ఒకరోజు కృష్ణాజిల్లా నుంచి వలస వచ్చిన అక్కన్న, సూరన్న అనే ఇద్దరు పండితులు శ్రీముఖలింగం దర్శనానికి వచ్చినపుడు, వంశధారా నదిలో స్నానం మాచరించే వేళ తమకు ఒక తాళపత్ర గ్రంధం దొరికిందని, దానిలో సూర్య దేవతారాధనకు సంబంధించిన వివరాలు ఉన్నాయని, సూర్యుడు తమకు కలలో కూడా కనిపించాడని చెప్పటం వల్ల వారినే రాజు ఆ సూర్యదేవాలయం అర్చకులుగా నియమించాడు. ఇప్పటికీ వారి వంశస్థులే ఇక్కడ అర్చకులుగా కొనసాగుతున్నారని అంటారు.
బహుశా ఈ ప్రాంతానికి శ్రీకాకుళం అనేపేరు కూడా వారిద్వారానే వచ్చి ఉండవచ్చు. కృష్ణాజిల్లాలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఉండే ప్రాంతాన్ని కూడా శ్రీకాకుళం అనే అంటారు.
మహేంద్ర వర్మ గంగవంశానికి చెందిన రాజు. ఆయన తదనంతరం గంగవంశపు రాజులు ఈ ఆలయ బాగోగులు చూశారు. వారి వంశం అంతరించినాక గజపతి రాజులు ఏలుబడిలో ఇక్కడ నిత్యపూజలు జరిగాయి.
1599వ సంవత్సరంలో నిజాం వంశస్థుడైన హజ్రత్ కులీ కుతుబ్ షా ఉత్తరాంధ్ర ప్రాంతంపై దాడిచేసి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. పదహారవ శతాబ్దంలో నిజాం రాజుల ఆస్థానంలో పనిచేసే షేర్ మహమ్మద్ ఖాన్ ఈ ప్రాంత సుబేదార్ గా నియమించ బడ్డాడు. అంటే నిజాం రాజుల ఆజ్నలకు లోబడి పనిచేసే ఒక ముఖ్య సైనికాధికారి అన్నమాట. ఆయన రాక తెలిసిన ఆయన కింద పనిచేసే సీతారామ స్వామి అనే ఒక పండిత ఉద్యోగి అతని తత్వం తెలియటం వల్ల ముందే జాగ్రత్త పడి మూలవిరాట్టును ఒక బావిలో దాచి పెట్టాడు. మహమ్మద్ ఖాన్ వస్తూనే ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు.
ఆ తరువాత 1778 వ సంవత్సరంలో ఎలమంచిలి పుల్లాజీ అనే ఆయనకి ఈ విగ్రహం కనబడింది. ఆయన తిరిగి ఈ విగ్రహ ప్రతిష్ట చేసి ఆలయాన్ని పునాదులనుంచి నిర్మించాడు. అప్పట్లో ఈ ఆలయ విమానం మన దక్షిణాది గుడుల సాంప్రదాయంలో ఉండేదట.
శ్రీకాకుళం లో సారవకోట అని ఒక మండంలం ఉంది. అక్కడ అలుదు అనే ఊరుంది ఆ గ్రామానికి చెందిన వరుదు బాబ్జీ అనే భక్తుడు పాత విమాన గోపురాన్ని తొలగించి ఓఢ్రదేశపు శైలిలో విమాన గోపురాన్ని కట్టించారు.
ఇక్కడ స్వామి అయిదు అడుగుల ఎత్తులో ఉంటాడు. ఈయన రెండు చేతులూ అభయ ముద్రలో ఉంటాయి. కమల రేకులతో కూడి విగ్రహం ఉంటుంది. ఈయన విగ్రహానికి సూర్య కొఠారి అనే కత్తి వ్రేలాడుతూ ఉంటుంది. ఈ విశేషం తిరుమల స్వామి విగ్రహంలో కనిపిస్తుంది. ఈయనతో పాటు ఈయన భార్యలు ముగ్గురు ఉంటారు. అందుకే ఇక్కడ సూర్యనారాయణ మూర్తిని ఉషా, పద్మినీ ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి అంటారు. ఈయన పాదాలు దగ్గర పింగళ, దండి అనే ద్వారపాలకులు ఉంటారు. వారితో పాటు సనక సనందనాది ఋషులు ఉంటారు. ఈయనతో పాటే ఈయన రధం, ఏడు గుర్రాలు మూలం విగ్రహంలో ఉంటాయి.
ఆ విగ్రహాన్ని చూడగానే ఘంటసాల గారి శ్లోకం గుర్తొస్తుంది.
సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం!
శ్వేతపద్మధరం దేవం, తం సూర్యం ప్రణమామ్యహం!
ఏడుగుర్రాలు పూన్చిన రథంపై, తెల్లకలువను ధరించి, ప్రచండుడై భాసించే కశ్యపుని కుమారుడైన సూర్యదేవునకు వందనం అని.
అందుకే కమలదళాలు ఈ విగ్రహం పై చెక్కబడి ఉంటాయ్. అలాగే ఏడు గుర్రాలు, ఒక రథం. ఇవికాక ముగ్గురు భార్యలు, ఇద్దరు ద్వార పాలకులు మరియు సనక, సనాతన, సనందన, సనత్కుమారులనే నలుగురు ఋషులు ఉంటారు. వీరినే మనం సనక సనందనాదులంటాం. సూర్యుడు తోనే వెలుగు అందుకే కిరణాలు కూడా చెక్కబడి ఉంటాయి.
నీ చాదస్తం సంతకెళ్ళా! చెప్పిందే చెబుతున్నా వేమిటోయ్! అనుకుంటున్నారా? ఇక్కడే చిన్న సూక్ష్మం ఉంది.
ఒక శిల్పాన్ని కానీ, చిత్రాన్ని కానీ, కళాఖండాన్ని కానీ తీరిగ్గా పరిశీలించి ఆనందించేంత సమయం సుప్రసిద్ధ దేవాలయాలకు వెళ్ళినపుడు ఉండదు. తోపులాట కొంత, వెళ్ళక వెళ్ళక తీర్థయాత్రలకు వెళ్ళే భక్తులు నియమిత సమయంలో చూడవలసిన విషయాలు చాలా ఉండటం వల్ల త్వరితంగా దర్శనం చేసుకుని బయటకు వెళ్ళాలన్న కంగారు వల్ల కొంత, ఏ విగ్రహాన్ని తనివితీరా చూడలేరు. దానివల్ల దర్శన సమయంలో అలంకరణ మాత్రమే చూసి, ఆ పైన ఏదో ఒక స్తోత్రపారాయణ చేస్తూ, దేవుడు కనబడగానే కళ్ళుమూసుకుని కోరికలు కోరడం మీద దృష్టి నిలుపుతారు. ఆ కారణం వల్ల దర్శనం అయి బయటకొచ్చాక, ఏ దేవుని విగ్రహం తాలూకు మూర్తీ గుర్తుండదు. దీనికి తోడు ఉదయం లేచి ఏ బట్టలేసుకోవాలి, ఏ నగలు వేసుకోవాలి, ఏం వస్తువులు కొనాలి అనే వాటితో దర్శనానికి ఆలస్యం చేస్తారు. ఉన్న కొద్ది సమయం అక్కడే ఖర్చు అయిపోతే తరువాత చూడవలసిన విషయాల తాలూకు చిట్టా వల్ల మనసు ఆందోళనకు గురి అవుతుంది. దానాదీనా వెళ్ళిన ప్రయోజనం పూర్తిగా సిద్ధింఛక అసంతృప్తి కలుగుతుంది.
చూసేది దేవుడిని. ఆయనకు ఇంటి దగ్గర నుంచి కోరికలు విన్నవించుకున్నా సరిపోతుంది. తీరిక వేళ మొత్తం ఆయన సంకీర్తన చేసుకోవచ్చు. బయటకు వెళ్ళినపుడైనా సమయ పాలనతో త్వరగా తెమిలి దృష్టి ఆలయ విశేషాల్ని, విగ్రహ మూర్తుల సౌందర్యాన్ని ఆస్వాదించడానికి కేటాయించాలి. చూడటం అంటే మామూలుగా చూడటం కాదు. ఒక ప్రణాళికా బద్ధంగా చూడాలి. చేజిక్కించుకున్న సమయంలోనే ఇది సాధ్యం కావాలి. అలా త్వరగా ఆకళింపు కావాలంటే ముందు ఆ ఆలయం తాలూకు విశేషాల్ని, విగ్రహం తాలూకు రూపు రేఖల్ని అధ్యయనం చేయాలి. వీలయితే దొరికిన చిత్రాలతో, చదివిన విషయాలను జతచేసి ఒక ఊహ ఏర్పరుచుకోవాలి. అప్పుడు ప్రత్యక్షంలో ఎదురయ్యే మూర్తిని వేరే ధ్యాస లేక దూరం నుంచే చూస్తూ ఒక విషయం తరువాత ఒకటి పరిశీలించి ఊహకు, వాస్తవానికి మధ్య బేధం బెరీజు వేయాలి. విగ్రహం దగ్గరయినపుడు, కళ్ళుమూయకుండా కనిపించేంత వరకూ విపులంగా చూడాలి. అప్పుడు విగ్రహం తాలూకు సౌందర్యం పూర్తిగా మెదడులో నిక్షిప్తం అయ్యి ఎప్పుడు కళ్ళు మూసినా సాక్షాత్కారం అవుతుంది.
మనం దేవాలయాల్లో చూసే విగ్రహ ప్రతిష్ట జరగడానికి ముందు చాలా వ్యవహారం ఉంటుంది. శిల్పాచార్యులు, ఆగమశాస్త్ర పండితులు, దాత, శాస్త్రాచార్యులు మూలవిరాట్టు తాలూకు రూపలావణ్యలకోసం, ఆ ముఖంలో ద్యోతకం కావలసిన నవరసాలమీద చర్చిస్తారు. విగ్రహ పరిమాణం, పీఠం, ఆయుధాలు, తోరణం, అలంకరణలు, శిరోజాలు ఇలా ప్రతీదీ చర్చించాక శిల్పాచార్యుడు ఒక అవగాహనకు వచ్చి చిత్రం గీసుకుంటాడు. ఆపైన దాన్ని అందరూ పరిశీలించి తగినన్ని మార్పులు చేర్పులు చేసుకున్నాక చివరకు ఒక నిశ్చితరూపం పై అవగాహనకు వస్తారు. ఎన్నిక కాబడిన చివరిరూపుతో ఒక చిత్రం తిరిగి రచింపబడుతుంది. దాన్ని అనుసరించి రాయిని ఎన్నుకుని నిశ్చితమైన కొలతలతో శిల్ప నిర్మాణం జరుగుతుంది. అందుకే ప్రతీ విగ్రహానికీ, దేవాలయానీకీ ఒక ప్రత్యేకత ఉంటుంది.
పైపైన చూస్తే అన్నీ ఒకేలా ఉంటాయి. విపులంగా చూస్తే అందం తెలుస్తుంది. అందుకే ఇంత వివరణ.
పైన చెప్పిన విధంగా ఈ సారి అరసవెల్లి స్వామిని చూడండి. ఆయన మీకళ్ళల్లో బందీ అవ్వటం ఖాయం.
ఇంకా ఉంది
సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి