1, జులై 2019, సోమవారం

Nostalgia


Nostalgia


ఈ మధ్య కాలంలో నాష్టాల్జియా అనే మానసిక వైపరీత్యం తరచూ ఫేస్ బుక్ లో దర్శనం ఇస్తోంది.

గతకాలం తాలూకు జ్నాపకాలను నెమరువేసుకుంటూ ఆనందం పొందటాన్ని నాష్టాల్జియా అంటాం.

ఆరుబయట భోజనాలు, కర్ర బిళ్ళ ఆటలు, తొక్కుడు బిళ్ళ, చాకలిబాన, నేలబండ, ఏడుపెంకులాట, దూరదర్శన్ లో యాడ్స్, బజాజ్ చేతక్, ధమ్స్అప్, పిప్పరమెంట్ తాడు చక్రాలు....ఇలా  ఒకప్పటి జీవితాన్ని నెమరు వేసుకుంటూ పెట్టే పోస్టులు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.  మొదట్లో ఇవన్నీ చాలా బావున్నాయి. గతం లోని తీపి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చాయి. జనాలు కాస్త ఇంట్రెస్ట్ చూపించేసరికి చాలా మంది మిత్రులు వేలంవెర్రిగా ఇలాంటి పోస్ట్లు పెట్టేస్తున్నారు.

ఒక గ్రూప్ లో ఒకాయన ఈళ్ళూ తీసే దువ్వెన్నలు, వేకో బిళ్ళలు, సపట్ మలామ్ బొమ్మలు పెట్టి ఇవేంటో తెలుసా అని అదేపనిగా క్విజ్ పోటీలు పెట్టేస్తున్నారు.  ఇక చాలురా నాయనా అన్నా వినటం లేదు. గతం తీపి జ్ఞాపకాలు గుర్తుకు తేవాలి కానీ వెగటు కలిగించటం ఎబ్బెట్టుగా ఉంటుంది.

రోడ్డుమీద కనబడ్డ ఒక కుందనపు బొమ్మని ఆపి, బానే ఉన్నావే, నీ చిన్నతనంలో చీవిడి ముక్కు, లూజు డ్రాయర్లు వేసుకుని ఏబ్రాసి పీనుగులా ఉండేదానివని గతం గుర్తుకు తెస్తే ఆ పిల్ల ఇబ్బంది పడి చికాగ్గా చూడదూ! అలా చేసినప్పుడు చుట్టూ ఎవరైనా ఆమె స్నేహితులుంటే ఆ పిల్లని ఎంత అసహ్యంగా ఊహించుకుంటారు చెప్పండి. తద్వారా ఆ పిల్లమీద ఎవరికైనా హైప్ ఉంటే అదిపోయి దాని స్థానంలో ఒక అగ్లీ పిక్చర్ కనబడుతుంది. చివరికి ఆ పిల్లమీద బోల్డన్ని జోకులు పుట్టుకొస్తాయి. కాబట్టి గతం గుర్తుకు తెచ్చే టపుడు కాస్త సభ్యత హుందాతనం పాటించాలి.

ఒకప్పుడు రేడియోలో వచ్చే ఒక సంస్కృత  శ్లోకం వైరల్ అయ్యింది. అదే కేయూరాణి నభూషయంతి పురుషం శ్లోకం. అది గుర్తుకొచ్చినపుడు చాలా ఆనందం కలుగుతుంది. మన పిల్లలకి ఆ శ్లోకం, దాని భావం చెప్పి మన సంస్కృతి సాంప్రదాయాల మీద ఒక మంచి అభిప్రాయం కలిగించడానికి అవకాశం ఉంది. అంతే తప్ప మా చిన్నప్పుడు జనాలకి రెండుచేతులూ, రెండు కాళ్ళూ, ఒక ముక్కు ఉండేవి, ఆ రోజులే వేరంటూ పిచ్చి, పిచ్చి రాతలు పెడితే వెగటొస్తుంది. గతం తాలూకు వైభవాలు, నడవడిక, పెద్దల మీద భక్తి, కుటుంబ వాతావరణం లాంటి అమూల్యమైన విషయాలు విడిచిపెట్టి దురదొస్తే గోక్కునే వాళ్ళం, ఉమ్ముతో పలకలు తుడుచుకునేవాళ్ళం, చెంబట్టుకుని బయలుదేరే వాళ్ళం అంటూ చెత్త రాతలు రాస్తే వెనుకటి తరం మీద నేటి తరానికి ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది? ఇవన్నీ ఆలోచించరా? ప్రతీ జెనరేషన్ లోనూ ఉన్నతమైన జీవన విధానంతో  పాటు కొన్ని లోపాలు, అనాగరికతతో కూడిన ఇబ్బందులూ ఉంటాయ్. కాలక్రమంలో ఇబ్బందులు తొలగి మనిషి మరింత నాగరికతను, ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితాన్ని సాగిస్తాడు. కొత్త వచ్చినపుడు పాత కప్పడిపోతుంది. చెడుతో పాటు మంచీ మరుగవుతుంది. అటువంటప్పుడు కొత్త తరానికి మరుగున పడిన మంచిని వెలికి తీసి పరిచయం చేయాలి కానీ, పెద్దవాళ్ళందరూ అనాగరికులనే అభిప్రాయం కలిగించకూడదు‌. మట్టి వాసన తెలిసిన మనిషి, మట్టి మీద అభిమానం పెంచాలి కానీ, అడ్డదిడ్డంగా రాసి  బురదలో దొర్లే బ్రతుకులు వీరివనే అభిప్రాయం కలిగించకూడదు. చెప్పే విధానం సరిగా లేకపోతే ఒకదానికొకటి అర్థమై మన సంస్కృతి సాంప్రదాయాల మీద కొత్త తరానికి చులకన అభిప్రాయం ఏర్పడుతుంది. తద్వారా ఎప్పటికీ మన విలువల్ని వారు గుర్తించరు. ఒక పోస్టు పెడితే ఎంత హుందాగా ఉండాలి? చదివిన వాడికి ఒక సదభిప్రాయం కలగాలి.

యాస్కుడు నిరుక్తంలో "మత్వా కర్మాణి సీవ్యంతి, కుర్వంతి" అని మనుష్య శబ్దానికి వ్యుత్పత్తి చెప్పాడు. చేసే పనులను ఆలోచన చేసి ఆచరణలో పెట్టేవాడు మనిషిని దాని అభిప్రాయం. చెడును శోషించి, మంచిని గ్రహించి ఆ నవనీతాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం మనిషి కర్తవ్యం. ఇప్పటి పిల్లలకు ఒకప్పటి తరం బాధలు తెలియవు. ప్రస్తుతం వారు జీవిస్తున్న జీవన శైలిని బట్టే గతం ఊహిస్తారు. మన సాంప్రదాయం మీద అవగాహన తక్కువగా వారి కుంటుంది‌. అటువంటి వాళ్ళకు చక్కటి జీవన సరళిని అలవాటు చేయాలంటే ముందు మనమీద వారికి  గౌరవం కలగాలి. ఎంత కష్టపడితే ఈ స్థాయికి చేరుకున్నామో తెలియచేయాలి. విలువైన విషయాలు ఎన్నో వదిలి పెట్టి, అర్ధం పర్ధం లేని పోస్టులకు నాస్టాల్జియా అనే పేరు పెట్టకూడదు.

ఎవరైనా పిల్లలు పెద్దవాళ్ళ గ్రూప్ లో ఉత్సాహం కొద్దీ తొంగిచూస్తే, ఏవిటి వీళ్ళ జ్ఞాపకాలు? ఇంతపేలవంగా ఉన్నాయని అనిపించ కూడదు.

దువ్వెన ఫోటో పెట్టి ఇదేవిటో ఎంతమందికి తెలుసో చెప్పండి అనడం, గోచీలు మీలో ఎంతమంది చిన్నప్పుడు పెట్టుకునేవారో చెప్పండి అని ప్రశ్నలు వేయటం, ఇవా గ్రూప్ లో పెట్టవలసిన విషయాలు? అనుభవం కలిగిన పెద్దలు, కష్టాలు అంతుచూసిన అనుభవజ్ఞులు, సాహిత్యం పండించిన పెద్దలు ఎంతోమంది ప్రతీ గ్రూపులో ఉంటున్నారే, వాళ్ళు చూస్తాన్నారన్న స్పృహ కూడా చాలామందికి ఉండటం లేదు.  చాలా గ్రూపులలో ఇటువంటివి గమనించాక అనిపించింది, ఎన్నో విలువైన విషయాలు, పుస్తక పరిచయాలు, పదిమందికి ఉపయోగపడే చిట్కాలు, వంటలు, వార్పులు, కవితలు, కధలూ, కధానికలు,జీవిత సమస్యలు వాటిని ధైర్యంగా ఎదుర్కొన్న వైనాలు లాంటివి ఎంతోమంది పెడుతూ ఉంటే... ఏవేవో పోస్టులు పెట్టి ప్రతీ గ్రూపునీ చెత్తతో నింపేసి, గ్రూపు విలువల్ని తేలిక చేసేస్తున్నారు. హాస్యం, వ్యంగ్యం, చమత్కారం, విభిన్నమైన ఆలోచన, పాండిత్యం, సంస్కృతి, సాంప్రదాయం, ఆలోచన, మెదడుకు మేత లాంటి పోస్టులు పెడితే అందరూ సంతోషిస్తారు కదా.

వార పత్రికలు ఎందరు చదువుతున్నారో తెలియదు కానీ ఫేస్బుక్ లో పోస్టులు చాలామంది చదువుతున్నారు. వారి అభిరుచిని బట్టి గ్రూపులు ఎన్నుకుంటుంన్నారు.  అటువంటి ఔత్సాహికుల ఉత్సాహం, నీరు కారిపోయేలా ఏదీ పెట్టకూడదు. ఎప్పుడైనా అలాంటి పోస్టులు చూసి ఎడ్మిన్స్ అభ్యంతరం పెడితే వీళ్ళ అలకలు. వేరే గ్రూపు పెట్టే ప్రయత్నాలు, వాటిలో పాత గ్రూపులమీద విమర్శలు‌. ప్రతీ గ్రూపుకి ఒక ధ్యేయం, టార్గెటెడ్ ఫోకస్ ఉంటుంది. దాన్ని పరిశీలిస్తూ పోస్టులు పెట్టాలి. ఏవరేజ్ ఏజ్ గ్రూప్ ఏంటి? అక్కడ మెంబెర్స్ కి ఏదిష్టం, అది మన పోస్టులో ఉందా? ఇవికూడా గమనించాలి. వేరే గ్రూపునుంచి పోస్టు ఎత్తుకొచ్చి పేరు మార్చి పెట్టుకోవటం, చేరిన గ్రూపులో కాస్త నాణ్యమైనవి, ఎక్కువ లైకులు వచ్చిన పోస్టులు తస్కరించి వారి పేరుతో వేరే గ్రూపులో పెట్టడం ఎక్కువయిపోతోంది. అది గ్రహించిన వారు ఇది ఫలానా వారి పోస్టు కదా?  అంటే తలా తోకా లేని సమాధానాలు ఇవ్వటం పరిపాటి అయిపోయింది.

షేర్ చేయవచ్చు, అదీ వీలుకాకపోతే రచయిత పేరు తొలగించకుండా కాపీ పేస్ట్ చేయొచ్చు, అది హుందా అయిన తీరుకు, మంచి విషయాన్ని పది మందితో పంచుకోవాలన్న పరిణితికి నిదర్శనం. కానీ చౌర్యం హర్షణీయం కాదు కదా! 

అడ్మిన్స్ అప్పటికీ మొత్తుకుంటున్నారు, అలాంటి పనులు చేసి గ్రూప్ పరువు తీయవద్దని, అయినా చెవిటి వాని ముందు శంఖంలా, అరణ్య రోదనలా తయారవుతోంది వారి పిలుపు. ఇప్పటికైనా కాస్త హుందాతనం తో వ్యవహరిస్తే, గ్రూపు పరువు, వెనుకటి తరం వారి పేరూ కొత్త తరం దృష్టిలో పెంచిన వారమవుతాం.

మాన్యులైన ఫేస్బుక్ మిత్రులు, గ్రూప్  సభ్యులు గమనించ ప్రార్థన.

SSS SRINIVAS VEMURI
Srikakulam, 9492732042

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి